మోడీపై గుస్సా: బీజేపీపై నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ వర్గంగా మెజారిటీ నాయకులు ఉన్న విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో ప్రధాని నరేంద్ర మోడీ వర్గంగా మెజారిటీ నాయకులు ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆర్ఎస్ఎస్ వర్గంగా మరికొందరు నాయకులు కూడా ఉన్నారు. అయితే..తన వర్గాన్నిఎప్పటికప్పుడు పెంచుకుంటూ వస్తున్న ప్రధాని మోడీ.. ఆర్ ఎస్ ఎస్ వర్గంగా ముద్రపడిన వారిని పక్కకు తప్పిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కరీని మాత్రం ఆయన తప్పించలేక పోతున్నారు. బలమైన ఆర్ ఎస్ ఎస్ మద్దతు ఉన్న నాయకుడు కావడం, మహారాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరుండడంతో నితిన్ గడ్కరీ తనకు సెగ పెడతారని తెలిసినా..ఆయనను మాత్రం తప్పించే ప్రయత్నం చేయలేక పోతున్నారు.అయితే.. మోడీని మిగిలిన నాయకులు పొగిడినట్టు గడ్కరీ పొగడరు.పైగా.. మోడీ విధానాలను,ఆయన అనుసరిస్తున్న పాలనా తీరును కూడా.. గడ్కరీ పలు సందర్భాల్లో పరోక్షంగా ఎండగట్టారు. కరోనా సమయంలో “ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది“ అని అన్నారు. `అగ్నివీర్` స్కీమ్‌ను తెచ్చినప్పుడుకూడా.. సూటి వ్యాఖ్యలు చేశారు.ఇలా తరచుగా మోడీ నిర్ణయాలను గడ్కరీ పరోక్షంగా విమర్శిస్తున్నారు. తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలతో గడ్కరీ విరుచుకుపడ్డ తీరు మోడీ వర్గంలో కలకలం రేపింది.“బీజేపీ ఎటు పోతోందో కూడా అర్ధం కావడం లేదని కొందరు నాకు చెప్పారు. నేను ఎలా స్పందించాలో అర్ధం కాలేదని వ్యాఖ్యానించారు.అంతటితో కూడా ఆగని గడ్కరీ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. “బీజేపీ అంటే భిన్నమైన పార్టీ అని అద్వానీ చెప్పేవారు.ఇతర పార్టీల కంటే మనం ఎంత భిన్నంగా ఉన్నామో ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే మనం అర్థం చేసుకోవాలి.కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులను సహించలేకే.. బీజేపీకి ప్రజలు అండగా ఉన్నారు. అందుకే వరుసగా మూడు ఎన్నికల్లో ప్రజలు ఎన్నుకున్నారు.ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుతున్నా.అదేసమయంలో కాంగ్రెస్ చేసిన తప్పులనే మన పార్టీ కూడా చేస్తే.. ఎలా అన్న ప్రశ్నలు వస్తే..చేయకూడదని చెబుతున్నా. కాంగ్రెస్ చేసిన పనినే మనం కూడా కొనసాగిస్తే,వారికి మనకు తేడా ఏంటి? వారు అధికారం నుంచి నిష్క్రమించినా.. మనం అధికారంలోకి వచ్చినా ప్రయోజనం ఉండదు“ అని గడ్కరీ సూటిగా వ్యాఖ్యానించారు. దీనిని బట్టి మోడీపై ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్ధమవుతుంది. చిత్రం ఏంటంటే.. శనివారం ప్రధాని మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. ప్రొటోకాల్ ప్రకారం..ఇదే రాష్ట్ర కేంద్ర మంత్రిగా గడ్కరీ ఆయనను రిసీవ్ చేసుకోవాలి.కానీ.. గడ్కరీ అసలు రాష్ట్రంలోనే లేకుండా గోవాలో పర్యటించడం గమనార్హం.
👉 కొత్త క్రిమినల్ చట్టాలు రాజ్యాంగ విరుద్ధం..పౌర స్వేచ్ఛను కాల రాయడం.. నియంతృ ధోరణికి పరాకాష్ట.. పలువురు మేధావులు, ప్రజాసంఘాల ఆరోపణ ..
కొత్త క్రిమినల్ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని పౌర స్వేచ్ఛను కాల రాయడమే కాక,నియంతృ ధోరణికి పరాకాష్ట అని పలువురు మేధావులు, ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు శనివారం స్థానిక బాలోత్సవ్ భవన్ లో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ సివిల్ రైట్స్ ఏపీ సి ఆర్ ఆధ్వర్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలిండియా లాయర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ వలస చట్టాలను రద్దు చేస్తామని చెప్పి అంతకంటే దుర్మార్గమైన చట్టాలను ప్రవేశపెట్టిందని ఆరోపించారు.న్యాయవ్యవస్థకు అధికారాలను తగ్గించి అధికారులకు పోలీసులకు విశృంఖ అధికారాలు కట్టబెట్టడం వల్ల ప్రజల స్వేచ్ఛకు తీవ్రమైన భంగం కలుగుతుందన్నారు.బహిరంగ విచారణ చేయకుండా సాక్షాలు లేకుండా కనీసం లాయర్లను నియమించుకునే అధికారాలు లేకుండా అనుమానం అనే నె పం మీద ఎవరినైనా అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని ఖండించారు. నిందితులకు 40 నుండి 90 రోజుల వరకు బెయిల్ వచ్చే అవకాశం లేదన్నారు.ఇప్పటికే ఉ.పా వంటి నిర్బంధ చట్టాల వలన ఎంతో మంది మేధావులు ప్రొఫెసర్లు న్యాయవాదులు ఏళ్ల తరబడిగా జైల్లలో మగ్గుతున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాలను రద్దు చేసేందుకు ఇప్పటికే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు పార్లమెంటులో చర్చలు జరపకుండా ప్రతిపక్షాల పార్టీల వారిని సస్పెండ్ చేసి ఈ చట్టాలను అమలులోకి తేవడం నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుందన్నారు.నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కే. మురళి మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన చట్టాలు ప్రజలకు రక్షణ కల్పించకపోగా , ప్రజల స్వేచ్ఛను హరించే ప్రమాదం ఉందన్నారు. ఆచరణలో ప్రజలకు రక్షణ కల్పించే చట్టాలను మార్చి వేశారన్నారు.ప్రజల కోసం పనిచేసే ప్రజాసంఘాలు, పార్టీలలో ఎవరైనా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదిస్తే అటువంటి వారిని ఎటువంటి సాక్షాధారాలు లేకుండా ఆర్గనైజ్ డ్ క్రిమినల్ సిండికేట్ గా చిత్రీకరించి అరెస్టు చేసి నిర్బందించే కుట్రలో భాగమే ఈ చట్టాలను ప్రవేశపెట్టడంలో అంతరార్థం అని ఆరోపించారు. అడవులు 33% ఉండాలని పర్యావరణ శాస్త్రలు సూచిస్తుండగా.. ప్రస్తుతం మన దేశంలో అడవులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 20 శాతం ఉంటే బిజెపి హయాంకు 12 శాతం మాత్రమే ఉన్నాయని.. దీనివల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.అటవీ సంపదను కొల్లగొట్టడానికి అనుకూలమైన చట్టాలను కూడా చేస్తున్నారని ఆరోపించారు. పరిపాలన అనేది చట్టపరిధి లోపల ఉండాలి కానీ చట్టం ద్వారానే పరిపాలన జరగాలనే అంశం ప్రజాస్వామ్య పద్ధతులకు వ్యతిరేకమని ఆయనతో ఏపీ సి ఆర్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ లుక్మాన్ కార్యవర్గ సభ్యులు అడ్వకేట్ అజ్మతునిస తదితరులు ఆరోపించారు.ఈ చట్టాలను వ్యతిరేకించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని వారు కోరారు.కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులతో పాటు పలు విద్యాసంస్థల లా కోర్సు విద్యార్థులు పాల్గొన్నారు.
👉 సోనియాగాంధీతో సీఎం హేమంత్ సోరెన్ భేటీ..జార్ఖండ్ సీఎం,జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ శనివారం ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు. మనీలాండరింగ్ కేసులో జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన తర్వాత సోరెన్ తొలిసారి సోనియాను కలిసేందుకు వచ్చారు. బీజేపీ న్యాయవ్యవస్థను అవమానిస్తోందని సోరెన్ అన్నారు. కేజ్రీవాల్‌కు త్వరలో బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామన్నారు.రాజ్యాంగ హత్యా దినోత్సవంపై స్పందిస్తూ బీజేపీ ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెబుతారన్నారు.
👉పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన తృణమూల్ కాంగ్రెస్..పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన తృణమూల్ కాంగ్రెస్*పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొంది జోరుమీదున్న తృణమూల్ కాంగ్రెస్.. తాజా ఉప ఎన్నికల్లోనూ హవా కొనసాగించింది. ఇక్కడ రాయ్‌గంజ్, రాణాఘాట్, బాగ్దా, మాణిక్‌తలా.. నాలుగు స్థానాల్లోనూ టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక, ఉత్తరాఖండ్‌లో మంగలౌర్, బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంది.*
👉 పంజాబ్‌లో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీ..నేడు వెలువడిన ఉపఎన్నిక ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది పంజాబ్‌లోని జలంధర్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మోహిందర్ భగత్ విజయం సాధించారు. 64 ఏళ్ల భగత్ 37,325 ఓట్ల తేడాతో తన సమీప బీజేపీ అభ్యర్థి షీతల్‌పై గెలుపొందారు. భారతీయ జనతా పార్టీకి చెందిన షీతల్ అంగురాల్ మరియు కాంగ్రెస్ పార్టీకి చెందిన సురీందర్ కౌర్‌లపై ఆయన పోటీ చేశారు.
👉కెప్టెన్ అన్షుమన్ సతీమణిపై వివాదాస్పద పోస్టు.. నెటిజన్‌పై కేసు..కీర్తి చక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ సతీమణి స్మృతిసింగ్‌పై వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగాను ఢిల్లీ పోలీసులు ఓ నెటిజన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు నిందితునిపై ఇటీవలే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్ 2024)సెక్షన్ 79, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు పెట్టారు. సదరు వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని NCW ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు లేఖ రాసింది.
👉 గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాం: డీజీపీ.. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ ద్వారకా తిరుమలరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన వెల్లడించారు. గిరిజనులను వాడుకుని గంజాయి సాగు చేస్తున్న తీరును అరికడతామన్నారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
👉మచిలీపట్నం సర్వోజన ప్రభుత్వాసుపత్రిలో అప్పుడే పుట్టిన పసికందు తెల్లవారుజామున ఒకటిన్నరకు అపహరణ. సమాచారం అందుకున్న మచిలీపట్నం పోలీసులు గాలింపు నిందితులను పట్టివేత.
👉 పాక్ క్రికెటర్ కి ఉతప్ప సాయం.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2024 టోర్నీ ఫైనల్లో పాక్ బ్యాటర్ మిస్బా-ఉల్-హక్ తొడ కండరాల నొప్పితో బాధపడ్డారు. ఆ సమయంలో టీమిండియా వికెట్ కీపర్ రాబిన్ ఉతప్ప అతనికి సాయం అందించారు. నడుస్తుండగా సపోర్ట్ గా నిలిచారు. దీంతో ఉతప్పపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్రీడాస్ఫూర్తి అంటే ఇదేనని కామెంట్స్ చేస్తున్నారు.
👉 ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ గా నియమితులైన ఏ ఆర్ దామోదర్… ఈయన గతంలో మార్కాపురం సబ్ డివిజన్ లో ట్రైనింగ్ డియస్పిగా పని చేశారు.
. 👉కంభం సర్కిల్ కి ఉన్నతాధికారుల ప్రశంసలు.. తక్కువ వ్యవధిలో 7. కేసులను ఛేదించిన కంభం సర్కిల్ బెస్తవారిపేట పోలీస్ వారిని అభినందించిన ఉన్నతాధికారులు బేస్తవారిపేట మండలంలో వరుస చోరీలకు చెక్ పెట్టిన పోలీస్..ఈ మధ్య కాలంలోబేస్తవారిపేట ఒంగోలు రోడ్డులో గల రైతు భరోసా కేంద్రంలో చోరీ…రైతులకు సంబంధించిన బోర్ల కేబుల్ . శంకర్ రెడ్డి కాలేజీ కి సంబంధించిన ఫినిషింగ్ వైర్ మరియు బోర్ రాగి వైర్ 1.20.000 ఖరీదు చేసే టీవీ..పూసలపాడు బస్టాండ్ సమీపంలో వెలుగొండ నిర్వాసితుల కొరకై నిర్మిస్తున్న R&R కాలనీలో ఇనుప గేట్లు పైపులు 12 ఎం ఎం ఒక టన్ను స్లాబ్ రాడ్లు దొంగిలించిన ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న కంభం సీఐ, బేస్తవారిపేట ఎస్సై నరసింహారావు..అనతి కాలంలో 7 కేసులలో పురోగతి సేధించి. ముగ్గురు ముద్దాయిలను అదుపులోకి తీసుకోని వారి వద్ద నుండి రెండు లక్షల 90 వేల. రూ. విలువగల వస్తువులను రికవరీ చేసిన కంభం సీఐ.. బేస్తవారిపేట ఎస్సై వరుస చోరీలకు పాల్పడుతున్న వారిని మార్కాపురం డి.ఎస్.పి ఆదేశాలతో కంభం సీఐ ఆధ్వర్యంలో బేస్తవారిపేట ఎస్సై తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా కేసులు చేదించినందుకు ఉన్నతాధికారులు ప్రశంసించగా స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
👉ప్రకాశం జిల్లా…ఇటీవల కాలికి శస్త్ర చికిత్స చేయించుకొని మార్కాపురంలోని ఆయన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని పరామర్శించిన మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, యర్రగొండపాలెం తెదేపా ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు.
👉 తెల్లవారితే నూతన గృహప్రవేశం..!!!భార్య భర్తలు మృతి..!అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొత్తగా నిర్మించిన ఇంటి పై కప్పు కూలిపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న దంపతులిద్దరూ మృతి చెందారు.వారి పక్కనే నిద్రిస్తున్న వారి కుమార్తె మానస, మృతురాలి తమ్ముడు రాముకి గాయాలయ్యాయి. బయట నిద్రిస్తున్న కుమారుడు సురక్షితంగా ఉన్నాడు. మారెప్ప(49) లక్ష్మి(45) దంపతులిద్దరూ ఈ ఘటనలో మృతి చెందారు. మారప్ప గ్రామంలో నూతన ఇంటిని నిర్మిచుకున్నారు.తెల్లవారితే కొత్త గృహప్రవేశం. రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి పూర్తిగా తడిసిన ఇంటి పైకప్పు వారు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.దంపతులిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.