👉సంధ్యా థియేటర్ సంఘటనలో బిజెపి ప్రమేయంపై నిప్పులు చేరిన విజయశాంతి..
ఈ ఘటనపై తాజాగా.. ప్రముఖ సీనియర్ హీరోయిన్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. ఒక సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్ట సంఘటన ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య తెలంగాణ విభజన రేఖలు తెచ్చే వరకూ వెళ్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. రెండు రోజుల పరిణామాలు, ప్రెస్‌మీట్‌లు అన్నీ భావోద్వేగానికి గురిచేస్తున్నాయని తెలిపారు.‘ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసి ఉందాం’అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఇప్పుడు అలా కాకుండా ప్రజల మనోభావాల మధ్య విభజనలు వచ్చే వరకూ నడవాలని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తోందని పేర్కొన్నారు.ఈ ఘటనను బీజేపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఈ ఘటనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.ఆ పార్టీకి చెందిన తెలుగు రాష్ట్రాల నేతల ప్రకటనల్లో ఇదే స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. సినీ పరిశ్రమను నాశనం చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. సినీ పరిశ్రమకు అన్ని ప్రాంతాల ప్రజలు కావాలని, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. అయితే.. ఇన్ని రోజులుగా విజయశాంతి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆమె ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు. ఇన్ని రోజులకు ఆమె పుష్ప 2 ఘటనపై స్పందించడం చర్చకు దారితీసింది.
👉 అస్సలు వదలవద్దు “సిపిఐ నారాయణ*
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై స్పందిస్తూ సీపీఐ నారాయణ ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో ఆయన తొలుత తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఇచ్చిన అనుమతిని సైతం తప్పుబట్టారు. అయితే సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ఇందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ నారాయణ కోరారు. ఇదేమీ సమాజానికి ఉపయోగపడే సినిమా కాదని, ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకుండా ఉండాల్సిందని నారాయణ వ్యాఖ్యానించారు.
సంధ్య థియేటర్ ఘటనలో పోలీసుల తప్పేం లేదని సీపీఐ నారాయణ తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి ఘటనలు జరగకుండా సినీ ఇండస్ట్రీ, ఆర్టిస్టులు, రాజకీయ నేతలు తగిన చర్యలు చేపట్టాలన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, త్వరలో తమ పార్టీ తరఫున కూడా సాయం ప్రకటిస్తామని నారాయణ తెలిపారు. ఇప్పటికే సంధ్య థియేటర్ ఘటనపై ప్రభుత్వం అల్లు అర్జున్ పై సీరియస్ అవుతున్న నేపథ్యంలో నారాయణ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
👉 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించాడు. చదరంగం ఆటలో వేగవంతంగా పావులు కదపడంలో దేవాన్ష్ ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 9 ఏళ్ల నారా దేవాన్ష్ “వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్ ను సాధించడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి సర్టిఫికెట్ అందడంతో నారా కుటుంబం సంతోషంలో మునిగితేలిపోతోంది.
ప్రసిద్ధ చెస్ సంకలనం నుండి ఎంపిక చేసిన 5334 సమస్యలు, కలయికలను పరిష్కరించి దేవాన్ష్ ఈ రికార్డు సాధించాడు.తన వ్యూహాత్మకమైన ఆటతీరు, థ్రిల్లింగ్ ప్రదర్శనతో నారా దేవాన్ష్ చెక్‌మేట్ మారథాన్ పేరుతో ఈ ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఈ రికార్డ్‌లో దేవాన్ష్ క్రమక్రమంగా సవాళ్లు విసిరే చెక్‌మేట్ పజిల్‌ల క్రమాన్ని పరిష్కరించాడు. తాజాగా దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా సాధించాడు. 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1నిమిషం 43సెకన్లలో పూర్తిచేసాడు. 9 చెస్ బోర్డ్‌లను కేవలం 5నిమిషాల్లో అమర్చాడు. మొత్తం 32 ముక్కలను మెరుపు వేగంతో సరైన స్థానాల్లో ఉంచాడు. దేవాన్ష్ ప్రపంచ రికార్డు ప్రయత్నాలను న్యాయనిర్ణేతలు, లండన్‌లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు పరిశీలించారు.
ఇంత చిన్న వయసులో కొడుకు దేవాన్ష్ సాధించిన రికార్డు విజయంపై తండ్రి, మంత్రి లోకేష్ స్పందించారు దేవాన్ష్ లేజర్ షార్ప్ ఫోకస్‌తో శిక్షణ పొందడం తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. క్రీడను ఉత్సాహంగా స్వీకరించాడని, గ్లోబల్ అరేనాలో భారతీయ చెస్ క్రీడాకారుల అద్భుతమైన, చారిత్రాత్మక ప్రదర్శనల నుండి దేవాన్ష్ ప్రేరణ పొందాడని తెలిపారు. దేవాన్ష్ కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్ చెస్ అకాడమీకి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.
👉మార్కాపురం మెడికల్ కళాశాల నిర్మాణం కొనసాగించాలి…*
*ప్రైవేట్ భాగస్వామ్యం ఒప్పుకునేది లేదు – ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్*
మార్కాపురం – జిల్లాలోని అత్యంత వెనుకబడిన పశ్చిమ ప్రకాశమైన మార్కాపురంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసి ఏర్పాటు చేస్తున్న మెడికల్ కళాశాల నిర్మాణాన్ని కొనసాగించాలని, అందుకు తగిన నిధులు కేటాయించి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం మార్కాపురం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సిపిఎం పార్టీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్ డిమాండ్ చేశారు. మెడికల్ కళాశాల, బోధన ఆసుపత్రి, హాస్టల్ గదులు నిర్మాణాలు కొనసాగుతుండగా నూతన ప్రభుత్వం దానికి తిలోదకాలు ఇచ్చి ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం, మెడికల్ కళాశాల నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపివేసి గుత్తేదారు పలాయనం చిత్తగించడం సహేతుకం కాదని దీనివల్ల ఈ ప్రాంత ప్రజలు ఆధునిక వైద్యానికి నోచుకోకపోవడం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఏర్పాటు జరిగినప్పటి నుంచి వైద్యం కోసం నిత్యం అల్లాడుతూ వందల వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, జబ్బు చేసిన, ప్రమాదాలు జరిగిన అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో సరైన వైద్యం లేక దూరప్రాంతాలకు వెళ్లే సమయంలో సుధీర్ఘ ప్రయాణంలోనే అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాథమిక కనీస అవసరమైన విద్య వైద్య ఆరోగ్యం వంటి అత్యవసరమైన మెడికల్ కళాశాల నిర్మాణంపై ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయం ఆక్షేపనీయమని, ప్రభుత్వ నిర్ణయం ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లడమేనని అన్నారు. మెడికల్ కళాశాలకు ఏర్పాటు చేసిన భోధన డాక్టర్లు ప్రొఫెసర్లు సిబ్బంది మెడికల్ కళాశాల రద్దడంతో వెళ్లిపోతున్నారని, దీన్ని అడ్డుకొని మెడికల్ కళాశాల తిరిగి నిర్మాణం కొనసాగడానికి, అందుకు తగిన నిధులు ఏర్పాటు కావడానికి ఆందోళన ఉదృతం చేసి ఈ ప్రాంత ప్రజలకు వైద్యం కోసం పాటుపడతామని అందులో తాము భాగస్వాములం అవుతామని రౌండ్ టేబుల్ సమావేశంలో తెలిపారు. అనంతరం స్థానిక మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారికి వారి స్వగృహంలో వినతి పత్రం సమర్పించి ప్రభుత్వం ద్వారా త్వరితగతిన మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకొని సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా, సిపిఎం పార్టీ కార్యదర్శి డీకేఎం రఫీ,సిపిఐ పార్టీ కార్యదర్శి అందె నాసరయ్య,సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దగ్గుబాటి సోమయ్య, ఎంపీజే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్, వీసీకే పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి నూతలపాటి రాజు, ఏఐటియుసి నాయకులు షేక్ ఖాసిం, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు ఓ.వీరారెడ్డి,సిఐటియు నాయకులు రాజు, రూబేను,కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రెహనా బాను,జిల్లా ఎస్సీ సెల్ నాయకులు వలపర్ల మోషే సుభాని,తదితరులు పాల్గొన్నారు.
👉కారు ఢీకొనడంతో పాస్టర్ మృతి..
స్థానిక కందులాపురం సెంటర్లో కారు ఢీకొనడంతో మోటార్ బైక్ పై వెళ్తున్న ఆర్సీఎం చర్చి పాస్టర్ వి మరియదాసు కు తీవ్ర గాయాలైనాయి. ఆయనను కంభం ప్రభుత్వ వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం నరసరావుపేటకు మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.పాస్టర్ మరియదాసు మార్కాపురం సమీపంలోని సిద్దాయపాలెం కు చెందినవారు..ఆయన గత నాలుగేళ్ల నుండి కంభం లోని ఆర్సిఎం చర్చిలో పాస్టర్ గా పనిచేస్తు న్నారు.కంభం ఎస్ఐ బి నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.క్రిస్మస్ వేడుకలకు ముందు పాస్టర్ ఆకస్మిక మరణంతో క్రైస్తవ సోదరులు శోకసముద్రంలో మునిగిపోయారు. జిల్లా స్టాపర్ రహమాన్..
👉 అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు..
కంభం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ప్రకాశం జిల్లా డిస్టిక్ ప్రొబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ షేక్. కాజా మొయిద్దీన్ ఆదేశాల మేరకు కంభం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వారి సిబ్బందితో కలిసి బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం గ్రామం వద్ద ఖాజీపురానికి వెళ్ళు క్రాస్ రోడ్డు వద్ద కొమరోలు గ్రామానికి చెందిన డి. తిరుమలయ్య మరియు డి. కిషోర్ అను ఇద్దరు వ్యక్తులు ఒక స్కూటీ ముందర భాగాన తెల్లటి గోతాము సంచిలో 54 (750 ఎం ఎల్) పరిమాణం కలిగిన గోవా మద్యం సీసాలు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్న ప్రాపర్టీని మరియు ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందనీ . కంభం ఎక్సైజ్ సీఐ ఎస్. కొండారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వారి సిబ్బంది అయిన రంగారావు,సంషీరు, పోలీస్ భాష, నాగేశ్వరరావు, సుబ్బరాయుడు, భూపాల్ రెడ్డి పాల్గొనడం జరిగింది.
సంధ్యా థియేటర్ సంఘటనలో బిజెపి ప్రమేయంపై నిప్పులు చేరిన విజయశాంతి.. అస్సలు వదలవద్దు “సిపిఐ నారాయణ* .. నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు … మార్కాపురం మెడికల్ కళాశాల నిర్మాణం కొనసాగించాలి… అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు.. రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మరియదాసు మృతి
Recent Posts