సోమవారం నాడు బదిలీపై ప్రకాశం జిల్లా వెళ్తున్న తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఐపీఎస్ కు స్థానిక పోలీస్ మైదానం నందు పెరేడ్ నిర్వహించి గౌరవ వందనం ఇచ్చారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో మరియు పరిపాలనలో సహాయ సహకారాలు హోంగార్డ్ స్థాయి నుండి ఉన్నత అధికారుల వరకు అందించారన్నారు . తిరుపతి జిల్లాలో ఇంతకాలం పనిచేయడం గర్వంగా ఉందన్నారు.ఈ రెండేళ్ల కాలంలో ప్రతి ఒక్కరూ అహర్నిశలు కష్టపడి తనకు స్ఫూర్తిదాయకమైన విజయాన్ని అందించారన్నారు. ఎస్పీగా తాను ఇచ్చిన సూచనలు పాటిస్తూ పోలీసు వ్యవస్థ యొక్క గౌరవాన్ని నిలబెట్టడంలో కృషిచేసిన అధికారులకు కిందిస్థాయి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్పీగా పనిచేసిన కాలంలో ఎవరి పట్ల నైనా పరుషంగా ప్రవర్తించి ఉంటే, ఎవరి మనసుల నైనా గాయపరిచేలా వ్యవహరించి ఉంటే, అది విధి నిర్వహణలో భాగమే కానీ వ్యక్తిగతమైన కక్షసాధింపు ధోరణి ఏమాత్రం కాదని,దయచేసి గ్రహించగలరని సిబ్బందిని ఉద్దేశించి అన్నారు. ఇక్కడ పనిచేసిన ఈ మధురానుభూతిని నా జీవిత కాలంలో మరిచిపోను నాతో నడిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రానున్న కాలంలో ఒక మంచి అవకాశం దక్కినప్పుడు తిరిగి మళ్లీ మీతో పని చేసే సందర్భం తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నానన్నారు. అనంతరం పోలీస్ కవాతు వాహనంలో ఆయనను మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టి జిల్లా పోలీసు యంత్రాంగం వాహనానికి పూలతాడును కట్టి లాగుతూ ఆత్మీయ వీడ్కోలు పలికారు.
కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు పరిపాలన, కులశేఖర్ శాంతి భద్రత, విమల కుమారి నేర విభాగం, రాజేంద్ర సెబ్, జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.