ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు, ఘాటు వ్యాఖ్యలు చేసేవారిలో పర్యాటక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు.ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతలపై తీవ్ర విమర్శలు, ఘాటు వ్యాఖ్యలు చేసేవారిలో పర్యాటక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒకరు. ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న రోజా ఇప్పుడు షర్మిలపై విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోజాకు పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ మంత్రులకు పట్టిన గతే వచ్చే ఎన్నికల్లో రోజాకు కూడా పడుతుందని షర్మిల హెచ్చరించారు.
నగరి నియోజకవర్గంలో రోజా దోపిడీని కూడా జబర్దస్త్ గా చేస్తున్నారని షర్మిల విమర్శించారు. రాత్రికి రాత్రే కొండలు మాయమవుతున్నాయని ఆరోపించారు. గ్రావెల్, మట్టి, ఇసుక, ఆఖరికి చిన్నచిన్న ఉద్యోగాల్లో సిఫారసులకు కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. హౌసింగ్ స్కీంలో రూ.కోట్ల స్కామ్ చేశారని ధ్వజమెత్తారు. వెంచర్లు వేయాలంటే రియల్టర్లు రోజాకు కప్పం చెల్లించాల్సిందేనని షర్మిల ఆరోపించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల నుంచి నెలవారీ ముడుపులు అందుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై పిచ్చివాగుడు వాగితే తెలంగాణలో బీఆర్‌ఎస్ మంత్రులకు పట్టిన గతే రోజాకు కూడా పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. నగరి ఎమ్మెల్యే రోజా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని షర్మిల మండిపడ్డారు. నోరుంది కదా అని పారేసుకోవద్దని హెచ్చరించారు. గతంలో రోజాను ‘ఐరన్ లెగ్’ అని పిలిచేవారని ఎద్దేవా చేశారు. అప్పట్లో రోజా తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎంతలా దూషించారో ప్రజలకు ఇంకా గుర్తుందన్నారు. నగరి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేస్తే రోజా, ఆమె అన్న, భర్తలకు ప్లాట్లయినా ఇవ్వాలి, లేదంటే కప్పమైనా కట్టాలని షర్మిల ఆరోపించారు. పేదలకు ఇచ్చే ఇళ్లు, ఉద్యోగాల్లోనూ ఆమె కమీషన్లు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. రోజాతో చెప్పించుకునే స్థితిలో తాను లేనన్నారు. మరమగ్గాలకు విద్యుత్తు ఛార్జీలు తగ్గించమని కార్మికులు గగ్గోలు పెడుతున్నా రోజా చెవికెక్కదా అంటూ నిలదీశారు. కిందటి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగనన్న తప్పారని షర్మిల ఆరోపించారు. ఆ తప్పులు ఎత్తి చూపుతున్నానని, చెల్లెలన్న ఇంగితం లేకుండా రోజాలాంటి వారి చేత తనను తిట్టిస్తున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడ బిడ్డనైన తనను, తన కుటుంబాన్ని, తన వాళ్లను సామాజిక మాధ్యమాల్లో అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఇంట్లో అక్కాచెల్లెళ్లు, అమ్మలు లేరా అని వైసీపీ నేతలను నిలదీశారు. ఇలాంటి నియంతలు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదన్నారు. ఈ నేపథ్యంలో రోజాపై షర్మిల వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.