👉 పంజాబ్ – హరియాణా మధ్యనున్న శంభు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారు.
కేంద్ర ప్రభుత్వం తమ ముందు ఉంచిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు శంభు బోర్డర్ వద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన రైతు సంఘాల నేతలు చెప్పారు.రైతులతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఐదు పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని ప్రతిపాదించారు. కానీ, దీని కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఐదేళ్ల ఒప్పందంపై రైతులు సంతకం పెట్టాల్సి ఉంటుంది.అయితే, చర్చల తర్వాత ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయని రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ చెప్పారు. 23 పంటలకు కనీస మద్దతు ధరను తాము కోరుతున్నట్లు తెలిపారు.
👉 ‘ఆందోళనకారుల పోస్టులు తీసేశాం, అకౌంట్లు రద్దు చేశాం’ అని అంగీకరించిన ట్విటర్ 😱… ప్రభుత్వం ఏమంటోంది?
ప్రధాన సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఎక్స్ (గతంలో ట్విటర్) భారత్‌లో కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లు, పోస్టులను తొలగించినట్లు అంగీకరించింది.భారత ప్రభుత్వం కంపెనీకి ‘ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్’ (కార్యనిర్వాహక ఆదేశాలు) పంపిన తర్వాత ఆ పేజీలను తీసివేసినట్లు ఎక్స్ పేర్కొంది.జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉందని ఆ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొన్నట్లు ఎక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో ఆ సంస్థ ఏకీభవించలేదు.తన అధికారిక అకౌంట్ లో ఎక్స్ తన వివరణ ఇచ్చింది.ఎక్స్ నుంచి తమ పోస్టులను తొలగించినట్లు పలువురు గతంలో ఫిర్యాదు చేశారు.
భారత్‌లో రైతుల నిరసనను కవర్ చేస్తున్న రిపోర్టర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, ప్రముఖ రైతు నాయకుల ఎక్స్ అకౌంట్లు సస్పెండ్ అయినట్లు ఎక్స్ యూజర్, జర్నలిస్ట్ అయిన మహ్మద్ జుబైర్ సోమవారం రాశారు.తన ఎక్స్ అకౌంట్‌తో పాటు న్యూస్ ప్లాట్‌ఫాం ‘గావ్ సవేరా’ను కూడా నిలిపివేసినట్లు జర్నలిస్ట్ మన్‌దీప్ పూనియా బీబీసీతో చెప్పారు.”మేం గ్రామీణ భారతాన్ని కవర్ చేసే ప్రొఫెషనల్ జర్నలిస్టులం. క్షేత్రస్థాయి నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాం. కానీ, ప్రభుత్వానికి అది అనవసరం. ప్రభుత్వం మా గొంతు నొక్కుతోంది. ఇది మా జీవనోపాధిని కూడా దెబ్బతీస్తుంది” అని ఆయన అన్నారు.ప్రభుత్వ ఆదేశానుసారం” భారత్‌లో అకౌంట్లు, పోస్టులు నిలిపివేస్తున్నట్లు ఎక్స్ తన వివరణలో పేర్కొంది.
👉జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో గురువారం సీబీఐ సోదాలు నిర్వహించింది.మరో 29 చోట్ల కూడా సీబీఐ సోదాలు చేసింది.సత్యపాల్ మాలిక్ బంధువు అనుమాలిక్ పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ- ఈ సోదాలు నిజమేనని ధ్రువీకరించారు.‘అసలు విషయం ఏమిటనేది నాకు తెలియదు. ఏడుగురు సభ్యులున్న సీబీఐ బృందం ఇక్కడకు వచ్చింది. దాదాపు 3, 4 గంటలపాటు సోదాలు నిర్వహించారు’’ అని ఆయన చెప్పారు.సీబీఐ అధికారులు ఇల్లంతా వెదకడంతోపాటు సత్యపాల్ మాలిక్ గదిని కూడా శోధించారు’’ అని అనుమాలిక్ చెప్పారు.ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అనేక విమర్శలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీనిపై ‘ఎక్స్’లో స్పందించారు.‘‘మాజీ గవర్నర్ నిజాలు చెబితే ఆయనింటికి సీబీఐను పంపిస్తారు. ప్రధాన ప్రతిపక్షం బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తారు. ఇదేనా ప్రజాస్వామ్యమంటే’’ అని ఆయన ప్రశ్నించారు.